సుపారీ ఇచ్చి తన భర్తను భార్య చంపించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అతని ప్రవర్తనతో విసుగెత్తిపోవడం వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ‘ఈ సుత్తితోనే చంపేయ్’ అంటూ సుపారీ రౌడీకి సూచించింది. దోపిడీహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ, చివరికి పోలీసుల విచారణలో ఆమె పట్టుబడింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని వికాస్ నగర్‌లో బట్టల దుకాణం నడిపే మృతుడు వీర్ బహదూర్ వర్మ (50).. కొన్ని నెలల కిందట తన షాపులో పని చేసే చంద్రకళ(28)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పెద్దది కాకముందే.. బాధితురాలి కుటుంబంతో రాజీ కుదుర్చొని చంద్రకళను పెళ్ళి చేసుకున్నాడు. వయసులో తనకంటే 22 రెండేళ్ళ పెద్దవాడు, పైగా అప్పటికే అతనికి పెళ్ళై పిల్లలున్నారు. అయినా గత్యంతరం లేకపోవడంతో చంద్రకళ అతడ్ని పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాతైనా అతడు సవ్యంగా ఉంటాడని భావించింది. కానీ.. అప్పటికీ వర్మ తన బుద్ధి మార్చుకోలేదు. వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి.
భర్త ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన చంద్రకళ.. ఏం చేయలేక మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎప్పుడైతే తన సోదరి కన్నేశాడో, ఆమె కోపం నషాళానికెక్కింది. కొన్ని వారాల కిందట వచ్చిన తన సోదరిపై వర్మ లైంగిక దాడి చేయబోయాడు. అది పసిగట్టిన చంద్రకళ భరించలేకపోయింది. ఇక సహించేది లేదని నిర్ణయించుకొని.. మొగుడ్ని చంపేందుకు ప్లాన్ వేసింది. రణ్‌హోలాకు చెందిన రౌడీ షీటర్ జుమ్మాన్‌ను కలిసి, తన భర్తను చంపే ప్రణాళిక రచించింది చంద్రకళ. లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా ఇచ్చి, దాంతోనే మొగుడ్ని చంపాలని కోరింది.
ప్లాన్ ప్రకారం.. మే 18న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో, సుపారీ రౌడీ సుత్తితో వర్మపై దాడి చేశాడు. అనంతరం శవాన్ని రోడ్డుపై పడేసి వెళ్ళిపోయాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే వర్మ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసి విరాచణ చేపట్టిన పోలీసులు.. భార్య చంద్రకళనే సుపారీ రౌడీతో కలిసి ఈ హత్య చేయించినట్టు వారం రోజుల తర్వాత ధృవీకరించారు. దీన్ని దోపీడీ హత్యగా మార్చేందుకు చంద్రకళ పన్నాగం పన్నిందని, ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి తేలింది. తాను జైలు పాలైనా.. తన చెల్లి జీవితం నిలబడిందని చంద్రకళ కన్నీళ్ళతో చెబుతోంది.