నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను తీసుకొని హైదరాబాద్ కి వచ్చి పనులు చేసుకొంటుంది. ఇక భర్త మాత్రం స్వగ్రామంలోనే నివసిస్తున్నాడు. ఇక ఇటీవల భర్త కుటుంబంలో వేడుకకు హాజరైన లలిత. భర్త పేరు మీద ఉన్న నాలుగెకరాల భూమిని తన పేరుమీద రాయాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయమై ఎన్నో రోజులుగా భార్యాభర్తలు గొడవపడుతుండగా .. వేడుక రోజు కూడా లలిత భర్తను వేధించింది.
భర్త ససేమిరా అనడంతో అర్ధరాత్రి భర్తకు మద్యంలో పురుగుల మందు కలిపి, తాగించి హతమార్చింది. ఉదయం ఏమి తెలియనిదానిలా భర్త మృతిచెందినట్లు ఏడవడం మొదలుపెట్టింది. అయితే లలిత ప్రవర్తనపై అనుమానం కలిగిన బంధువులు నిలదీసి అడగగా .. తానే హత్య చేసినట్లు ఒప్పుకొంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలితను అరెస్ట్ చేశారు