Wife Complains On His Wife For Torturing Him: తమ భార్యల నుంచి తమను కాపాడండి మహాప్రభో అంటూ ఇప్పటికే ఎందరో భార్యాబాధితులు కోర్టు మెట్లెక్కారు. రకరకాలుగా తమను భార్యలు హింసిస్తున్నారని.. వాళ్లు కోరుకుంటున్నట్లుగా ఉంటున్నప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ తమ గోడుని వెళ్లబోసుకున్నారు. ఇప్పుడు 70 ఏళ్ల వృద్ధుడు కూడా తన భార్య నుంచి విముక్తి కల్పించాలని కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. తనపై భార్య పలుసార్లు హత్యాయత్నం కూడా చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కోవడంతో.. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మైసూరు వీవీ పురం పరిధిలోని విజయనగరలో ఎం.రఘు కారియప్ప (70) అనే వృద్ధుడు తన భార్య జాస్మిన్‌తో నివసిస్తున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్న కారియప్ప ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య టీచర్‌గా పని పని చేస్తోంది. కట్ చేస్తే.. ఇటీవల కారియప్ప తన భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఐదేళ్ల నుంచి జాస్మిన్ తనను టార్చర్ పెడుతోందని, అనేకసార్లు హత్యాయత్నం కూడా చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు.. ఏప్రిల్ 15వ తేదీన 6 బంగారు ఉంగరాలు, 2 బంగారు నాణేలు, ఒక చైన్, ఒక పెద్ద గాజును తన భార్య దొంగిలించిందని చెప్పాడు. ఆ నగలన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నిస్తే, తానే తీసుకున్నానని భార్య చెప్పిందని.. తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదని వాపోయాడు. ఆ వస్తువుల్ని ఇప్పించాలని కోరాడు.
అయితే.. పోలీసులు కారియప్ప ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదు. వృద్ధుడు కదా.. ఈ వయసులో ఇలాంటి పంచాయతీలు ఎందుకు, ఇంటికెళ్లు అని సర్దిచెప్పి స్టేషన్ నుంచి పంపించేశారు. ఎంత వేడుకున్నా పోలీసులు తన సమస్యని పట్టించుకోకపోవడంతో.. కారియప్ప కోర్టులో అర్జీ వేసుకున్నాడు. దీన్ని పరిశీలించిన కోర్టు.. కేసు నమోదు చేసి, విచారణ జరపాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.