స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లడమే శాపమైంది. బర్త్‌డే వేడుకలో జరిగిన అవమానం.. హేళన మానసికంగా కృంగదీసింది. దీంతో ముక్కుపచ్చలారని ఓ బాలుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ నగరంలో పదో తరగతి విద్యార్థులు.. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్లారు. క్లాస్‌మేట్స్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. అయితే ఉన్నట్టుండి సహచర దళిత టెన్త్ విద్యార్థిని అవమానించడం మొదలు పెట్టారు. ఈవ్‌టీజింగ్ ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. బట్టలు విప్పి.. మూత్ర విసర్జన చేశారు. శారీరకంగా వేధింపులకు గురి చేశారు. మొబైల్‌లో రికార్డ్ చేసి వైరల్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో రికార్డింగ్ తొలగించమని బతిమాలినా డిలేట్ చేయలేదు. పైగా ఉమ్మివేసి మరింత హేళన చేశారు. దీంతో బాధిత విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన అవమానాన్ని తెలియజేశాడు. దీంతో పేరెంట్స్ వెంటనే కప్టైన్‌గంజ్ ఆలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కానీ అక్కడ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో మరింత వేదన కలిగించింది. దీంతో బాధిత విద్యార్థి (17) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంటనే మృతదేహాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట పెట్టి ధర్నా చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కేసులో అలసత్వం వహించిన పోలీసులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఇక ఆత్మహత్యకు కారకులైన నలుగురిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 351 (3) (మరణ బెదిరింపులు) కింద కేసు నమోదు చేశారు.