Road Accidents: పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాదు నుంచి బాపట్ల వెళ్లతున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదంలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుటలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణం పనులకోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పైప్ కు తగిలి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులున్నారు. అతివేగంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also:CM Revanth Reddy: అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
మరోవైపు, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటికుంటపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ బస్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను ఢీకొట్టి, అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమృత అనే మహిళ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాట్లాడుతూ, డ్రైవర్ మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తాటికుంటపల్లె నుంచి విద్యార్థులను రాయచోటి వైపు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.