Traffic Fine SMS Scam: ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలను కనుగొని మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ఒక కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మీ మొబైల్ ఫోన్‌కు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా విధించబడిందని, వెంటనే చెల్లించాలని పేర్కొంటూ SMS వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా అందులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయొద్దు.. అలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ వెబ్‌సైట్ అయిన పరివాహన్ (Parivahan)ను పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి.. లింకులను పంపుతున్నారు.
Read Also: Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లోనూ..‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు బుకింగ్స్!
ఈ నకిలీ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే అది మిమ్మల్ని మరో వెబ్‌పేజీకి తీసుకెళ్తుంది.. అక్కడ జరిమానా చెల్లించమని చూపిస్తూ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను కాజేస్తారు. అంతేకాకుండా ఈ లింక్‌ల ద్వారా మీ ఫోన్‌లో మాల్వేర్ ప్రవేశించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి మోసాల పట్ల సురక్షితంగా ఉండాలంటే, మీకు నిజంగా జరిమానా పడిందా అనే అనుమానం వచ్చినప్పుడు మెసేజ్‌లో ఉన్న లింక్‌ను తెరవకుండా నేరుగా పరివాహన్ లేదా మీ రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి వాహన నంబర్ ఎంటర్ చేసి తనిఖీ చేయాలని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు.
Read Also: T20 World Cup 2026: బంగ్లాదేశ్ ఔట్.. పాకిస్థాన్ డౌట్! పాక్ తప్పుకుంటే ఈ దేశానికి లక్కీ ఛాన్స్!
కాగా, ఈ మోసపూరిత SMSలు వస్తే వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం మంచిది అని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు గానీ, ఇతర ప్రభుత్వ శాఖలు గానీ వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుంచి లింక్ పంపి వెంటనే డబ్బు చెల్లించమని ఎప్పుడూ అడగవు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆర్థిక నష్టానికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నకిలీ లింక్‌ల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే వెంటనే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.