బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. భర్త మృతిచెందడంతో అతని పేరు మీద ఉన్న ఐదెకరాల పొలం సాయమ్మ పేరుకు మారింది. ఆ పొలం మీద వచ్చే డబ్బుతోనే కొడుకును చదివించి, పెద్దవాడిని చేసి, ముగ్గురు కూతుళ్ళకు వివాహం చేసింది. బాధ్యతలు అన్ని తీరాక , కొడుకు నారాయణ దగ్గరే ఉంటుంది. ఇక ఇటీవల ఆమె ఐదెకరాల పొలంపై కొడుకు కన్నేశాడు. ఆ భూమిని తన పేరు మీద రాయాలని తల్లితో ఘర్షణకు దిగాడు.
గత కొన్ని నెలల నుంచి ఆ భూమికి రైతు బంధు పథకం కింద ఆమె అకౌంట్ లో రూ. 25 వేలు జమ అవుతన్నాయి. ఈ డబ్బు విషయంలో తల్లితో గొడవపడిన నారాయణ పొలం తన పేరుమీద రాయాలని బలవంతం చేశాడు. ఆమె ససేమిరా అనడంతో కోపంతో రగిలిపోయిన అతడు తల్లి అని కూడా చూడకుండా గోడకేసి బాది, ఆమె స్పృహ తప్పి పడిపోగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా నిద్రలో తల్లి చనిపోయినట్లు నమ్మించాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సాయమ్మది హత్య అని గుర్తించారు. అనంతరం కొడుకును తమదైనరీతిలో ప్రశ్నించగా నిజం బయటపెట్టాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.