Bihar: పూజారి దారుణహత్య బీహార్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన పూజారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ హత్య స్థానికుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. గోపాల్ గంజ్ జిల్లాలోని దానాపూర్ గ్రామంలో శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఆయన బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడు అశోక్ కుమార్ షా సోదరుడు. దీంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది.
Read Also: Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త.. నేటి నుంచి స్పెషల్ బస్సులు
మనోజ్ కుమార్ తన ఇంటి నుంచి గుడికి వెళ్లే మార్గంలో అదృశ్యమయ్యాడని పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామంలోని పొదల్లో బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెబుతూ, రాళ్లదాడికి పాల్పడ్డారు. హైవేపై ఉన్న పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గోపాల్ గంజ్ డీఎస్పీ ప్రాంజల్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని శాంతిపచేశారు. మనోజ్ కుమార్ హత్య ఎందుకు, ఎలా జరిగిందో, ఎవరూ చేశారనే విషయాలు తమకు తెలియమని మరో సోదరుడు సురేష్ షా తెలిపారు.
ఈ హత్యపై బీజేపీ షహజాద్ పూనావాలా స్పందించారు. బీహార్‌లో ఇప్పుడు నితీష్ కుమార్ రాజ్ కాదు జంగిల్ రాజ్ నడుస్తోందని విమర్శించారు. ఇండియా కూటమి పాలనలో సాధువులు, పూజారులకు ప్రమాదమని విమర్శించారు. బీహార్ రాష్ట్రంలో ఎవరూ సురక్షితంగా లేరని అన్నారు.