Swimming Coach Harassed Married Woman In Hyderabad Boduppal: అతడు ఒక స్విమ్మింగ్ కోచ్. తన పిల్లలకు ఈత నేర్పించమని ఓ వివాహిత వస్తే, ఆమెపై కన్నేశాడు. లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. తన వలలో పడకపోయేసరికి.. వ్యక్తిగత ఫోటోలు తీసుకొని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అయినా అంగీకరించకపోవడంతో.. దాడికి దిగాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడినుంచి అతని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో.. చివరికి ఆ వివాహిత పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడతను కటకటాల వెనుక ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
అతని పేరు సుజిత్ (23). బోడుప్పల్ సిద్ధివినాయక కాలనీకి చెందిన అతను, పల్లవి మోడల్ స్కూల్‌లో స్విమ్మింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన ఓ వివాహిత, తన ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించాలని సుజిత్‌ను సంప్రదించింది. పిల్లలకు ఈత నేర్పించే క్రమంలోనే.. అతడు ఆ వివాహితతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తన పట్ల మంచిగా ప్రవర్తించడంతో.. ఆమె కూడా సన్నిహితంగానే మెలుగుతూ వచ్చింది. తన వ్యక్తిగత సమస్యల్ని అతనితో పంచుకుంది. ఇదే అదునుగా.. అనుమతి లేకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలను తీసుకున్నాడు. అనంతరం వాటిని చూపించి.. తనకు పడకసుఖం అందించాలని కోరాడు. లేదంటే ఆ ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు.
అయితే.. ఆ వివాహిత అతని బెదిరింపులకు లొంగలేదు. తన జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. దీంతో.. అతడు దాడికి దిగాడు. బాధితురాలి భర్త లేని సమయం చూసి, నేరుగా ఇంటికెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా అదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. తాను అఘాయిత్యానికి పాల్పడ్డ ఫోటోలు చూపించి, తనకు డబ్బులివ్వాలని, లేకపోతే ఆ ఫోటోల్ని భర్తకి చూపిస్తానని చెప్పి, ఆమె వద్ద నుంచి రూ. 1 లక్ష వరకు తీసుకున్నాడు. రానురాను అతని వేధింపులు పెరిగిపోవడంతో.. బాధితురాలు షీ టీమ్స్ ద్వారా మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు సుజిత్‌ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి పంపించారు.