Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.
Read Also: SRH Vs GT: ఉప్పల్‌లో గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. బ్యాట్లు ఝళిపించకపోతే అంతే..!
చిక్కబళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లికి చెందిన కృష్ణప్ప దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య 35 ఏళ్ల శారదని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. శారద పలు ఇళ్లలో పని మనిషిగా పని చేస్తుంది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శారద పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.
కృష్ణప్ప చంపాలనే ఉద్దేశ్యంతోనే బాగేపల్లి నుంచి వచ్చాడని పోలీసులు తెలిపారు. తన భార్య ఇంటికి వెళ్లే మార్గంలో వేచి చూసి దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడపై పదే పదే కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన శారద మరణించింది. కృష్ణప్ప సంఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు అతడిని వెంబడించి పోలీసులకు అప్పగించారు. బెంగళూర్ డిప్యూటీ కమిషనర్ సారా ఫాతిమా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నారు.