Student Suicides: ఒకే ఒక్క మార్క్ విద్యార్థి జీవితాన్ని డిసైడ్ చేస్తుందా? ఒక్క మార్క్ తక్కువ వస్తే.. ఫెయిల్.. ఒక్క మార్క్ ఎక్కువ వస్తే పాస్.. విద్యార్థుల జీవితాన్ని.. మరణాన్ని శాసించేది ఆ ఒక్క మార్కేనా? అసలు చదువులకు నిజంగా ఆ ఒక్క మార్కే కొలమానమా? అలాంటి మార్క్ కోసం తల్లిదండ్రులకు విద్యార్థులు కడుపుకోత మిగులుస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రెండు ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. గద్వాల జిల్లా కొత్తపల్లిలో విషాద ఘటన జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి… ఓ మహిళా లెక్చరర్ హేళన చేయడం, చెంపపై కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణం చెందాడు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
కొత్తపల్లికి చెందిన దంపతులు తెలుగు బుచ్చన్న, రేణమ్మ రెండో కుమారుడు తరుణ్.. గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. గత శనివారం కళాశాలలో ఒక మహిళా లెక్చరర్.. మొదటి ర్యాంక్ 435 మార్కులు వచ్చిన మరో విద్యార్థితో పోలుస్తూ తరుణ్‌ను అందరి ముందూ హేళన చేసింది. ఇలా నిరుత్సాహపరచడం సరికాదని తరుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కానీ ఆ లెక్చరర్ విచక్షణ కోల్పోయి నీవేమైనా మంత్రి కుమారుడివా అంటూ చెంపపై కొట్టింది. నలుగురిలో జరిగిన ఈ పరాభవాన్ని తరుణ్ తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల పాటు తీవ్ర భావోద్వేగానికి, ఒత్తిడికి లోనై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తరుణ్ రాసిన 3 పేజీల సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఒక విద్యార్థిని అతిగా పొగిడి.. మరో విద్యార్థిని నిరుత్సాహపరచడం సరైనది కాదని తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు తరుణ్. లెక్చరర్‌గా ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరుత్సాహపరచకండి అని రాసుకొచ్చాడు. నా చావుకు కారణమైన ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుందని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తరుణ్ తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాడని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పడంతో పాటు ఆ మహిళా లెక్చరర్‌ను మందలించామని చెప్పారు. కానీ ఈలోగానే తరుణ్.. బలవన్మరణానికి పాల్పడటం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
మరోవైపు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెనలో మరో విషాద ఘటన జరిగింది. నీట్‌లో తక్కువ మార్కులొచ్చాయని మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పంకెన గ్రామానికి చెందిన పాగే రాజయ్య – చంద్రక్క దంపతుల కూతురు కృష్ణవేణి.. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈ ఏడాది నీట్ రాసింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని… డాక్టర్ సీటు రాదని ఆందోళన చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగింది. బాత్‌రూమ్‌లో వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే బైక్‌పై ఆమెను మహదేవపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్. అక్కడి నుంచి భూపాలపల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచనతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణవేణి మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఎదిగి వచ్చిన కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
విద్యార్థుల ప్రతిభకు మార్కులే కొలమానమా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. కానీ ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు.. అటు అధ్యాపకులు మాత్రం మార్కులనే కొలమానంగా తీసుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కోసారి ఒత్తిడిలో తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. కాబట్టి మార్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

