బీహార్‌లో దారుణం జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలో విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో 11వ తరగతి విద్యార్థి చదువుతున్న విద్యార్థి.. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. బాధితుడు గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ముజఫర్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) విద్యా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్ కుమార్ కుర్హానీ బ్లాక్‌లో ఉన్న తుర్కీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అని చెప్పారు.
సౌరభ్ కుమార్, అతని స్నేహితులు ఓం ప్రకాష్ మరియు ప్రహ్లాద్ నేతృత్వంలోని మరొక బృందంతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సౌరభ్ తలపై వెదురు కర్రతో కొట్టాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం విద్యార్థి చనిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణ జరిగిన వెంటనే ఇరువైపుల విద్యార్థుల కుటుంబ సభ్యులు నుంచి ఫిర్యాదులు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సౌరభ్ మరణం తర్వాత మాత్రం నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే చనిపోయిన విద్యార్థి, నిందితులు మైనర్లేనని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే గొడవ జరిగిందన్న పుకార్లతో సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక విద్యార్థులు ఏఏ క్లాసులకు సంబంధించిన వాళ్లు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.