జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఈతకు వెళ్ళారు ఏడుగురు విద్యార్ధులు. ప్రమాదవశాత్తు ఒక విద్యార్ధి గల్లంతయ్యాడు. ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థి రఘునాథపల్లి మండలం శ్రీమాన్ నారాయణ పురం గ్రామానికి చెందిన మద్దూరి రంజిత్ గా గుర్తించారు. ఈతకు వెళ్ళిన మిగతా విద్యార్ధులు బయటకు రాగా రంజిత్ కనిపించకుండా పోయాడు. విద్యార్ధుల సమాచారంతో గతఈతగాళ్ళు రంజిత్ కోసం గాలించారు. రంజిత్ మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇది కేవలం పాఠశాల టీచర్ల నిర్లక్ష్యం అంటున్నారు గ్రామస్తులు.