హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక కసాయి కొడుకు క్షణికావేశంలో తల్లిని హతమార్చాడు. అడ్డొచ్చిన చెల్లిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన భాగ్యనగర నడిబొడ్డున జరగడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో పాపమ్మ కుటుంబం నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు సుధీర్ గతకొన్ని రోజులుగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. చిన్నదానికి, పెద్దదానికి తల్లి, చెల్లితో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంట్లో ఎక్ససైజ్ చేస్తూ కనిపించాడు. ఈ సమయంలో ఎక్ససైజ్ ఏంటి.. అని తల్లి మందలించడంతో సుధీర్ కోపోద్రిక్తుడయ్యాడు.
ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డొచ్చిన చెల్లిపై కూడా రాడ్ తో దాడి చేశాడు. తల్లికూతుళ్లు ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాపమ్మ మృతి చెందగా, చెల్లికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.