ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. కానీ అలాంటి ఇంటి దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న ఇంటిలోనే చోరీ చేసిన చెల్లెల్ని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ గాజులరామారంలోని షిరిడీ హిల్స్‌లో కొంత కాలంగా వేముల శ్రీకాంత్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నారు. కొత్త కారు పూజ కోసం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఆమని కూడా నివాసం ఉంటోంది.
ఆమనికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. కానీ భర్తతో విభేదాలు రావడంతో 8 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటు పడింది. అలా ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకుంది. పలువురి దగ్గర అప్పులు కూడా చేసింది. ఓ వైపు అప్పులు.. ఆన్ లైన్ గేమ్స్ కోసం డబ్బులు లేకపోవడం ఓ స్కెచ్చేసింది. అన్న శ్రీకాంత్‌తో ఉన్న విభేదాల కారణంగా.. అతడి ఇంట్లో చోరీ చేయాలని డిసైడ్ అయింది.. ఈ క్రమంలోనే తన స్నేహితులు కార్తీక్, అఖిల్‌తో కలిసి కుట్ర చేసింది. అన్న ఇంట్లో ఉన్న నగదు, బంగారం కొట్టేయాలని ప్లాన్ చేసింది ఆమని. అంతే.. అన్న, వదిన వచ్చిన రోజే వారి ఇంటి తాళం చెవి కొట్టేసింది. అర్ధరాత్రి కార్తీక్, అఖిల్‌కు ఆ తాళం చెవి ఇచ్చి గాజుల రామారంలోని శ్రీకాంత్ ఇంట్లో చోరీ చేయాలని చెప్పింది. వారు వచ్చి కీ తీసుకుని వెళ్లారు. ఇంట్లో ఉన్న డబ్బు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకుని తిరిగి వచ్చారు. మళ్లీ యథావిధిగా ఇంటి తాళం చెవిని ఆమనికి అప్పగించారు.
READ MORE: Thailand: బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసిన యువతి.. ప్రయివేట్ వీడియోలతో రూ. 102 కోట్లు వసూల్..
ఇంటికి తిరిగి వెళ్లిన శ్రీకాంత్.. చోరీ జరిగినట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. డబ్బు, బంగారం మాయమైందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న వాళ్లే చోరీ చేశారని ఓ అంచనాకు వచ్చారు. ఐతే ఆమని బెట్టింగ్ విషయం తెలియడంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కొంత బంగారాన్ని ఓ గోల్డ్ లోన్ కంపెనీ వారి దగ్గర కుదువ పెట్టి ఆమని డబ్బులు తెచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చోరీ కోసం నిందితులు ఉపయోగించిన సుత్తి, ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.