HYD LOVE MURDER: సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి ప్రేమ.. అతని ప్రాణాలు తీసింది. యువతి సోదరులు, బంధువులు కక్షకట్టి దాడి చేయడంతో బీటెక్ చదువుతున్న యువకుడు ప్రాణాలు వదిలాడు. రాత్రిపూట జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సిటీని ఉలిక్కపడేలా చేసింది. పైన ఫోటోలో ఉన్న యువకుడి పేరు యువన్ అలియాస్ అఖిల్. ప్రస్తుతం అల్వాల్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్‌మండీలో ఉన్న యువన్.. ఆ సమయంలో అక్కడి యువతిని ప్రేమించాడు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులు.. అల్వాల్‌కు మకాం మార్చడంతో అక్కడికి వెళ్లిపోయాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి యువతితో మాట్లాడుతున్నాడు.
మరోవైపు అమ్మాయి కుటుంబ సభ్యులు కులం కారణంగా ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అబ్బాయిని మరోసారి కలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అతడిని చంపేస్తామని బెదిరించినట్టు సమాచారం. ఈ విషయాలన్నీ యువతి తన ప్రియుడికి చెప్పినప్పటికీ, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో యువన్ వెనక్కి తగ్గలేదు. ఘటన జరిగిన రోజు రాత్రి యువన్ తన స్నేహితులతో కలిసి సెల్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన సుమారు 8 మంది యువకులు అతడితో వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తులతో దాడి చేసి తల, మెడ, ఛాతి భాగాల్లో సుమారు 15 కత్తిపోట్లు పొడిచి అక్కడికక్కడే హత్య చేశారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
యువన్ హత్య వార్త తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. హత్య వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం అఖిల్, యువతి మధ్య ఫోన్ కాల్‌లో జరిగిన సంభాషణల ఆడియో రికార్డు వెలుగులోకి వచ్చింది. చెప్పిన మాట వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని, నీపై తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆ యువతి అఖిల్‌తో చెబుతున్నట్టుగా రికార్డయ్యింది. కేసు పెట్టకపోతే ఇద్దరినీ బతుకనివ్వబోమని బెదిరస్తున్నారని చెప్పింది. ఇందుకు అఖిల్ స్పందిస్తూ మొన్ననే కాంప్రమైజ్ అయ్యాము కదా.. మళ్లి పోలీస్ కేసేమిటి? నాతో మాట్లాడొచ్చుకదా? అని జవాబిచ్చినట్టు ఆడియోలో వినిపిస్తోంది. దీంతో పథకం ప్రకారమే అఖిల్‌ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
