ప్రపంచం రోజుకో టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తోంది. గ్రహాల మీదకు వెళ్లి, అక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయినా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. నరబలులు ఇస్తే పిల్లలు పుడతారు, క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, నగ్నంగా పూజలు చేస్తే రోగాలు తగ్గుతాయని దొంగ బాబాల మాటలు నమ్మి కొందరు రోడ్డు పాలవుతున్నారు.. మరి కొందరు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక జంట పిల్లలు పుట్టడం లేదని భూత వైద్యుడిని నమ్మి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. గ్వాలియర్ లో బంటు బౌథేరియా, మమత అనే జంట నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్స్, గుళ్లు, గోపురాలు తిరిగారు. కానీ, ఫలితం లేదు. దీంతో ఇటీవల మమత ఒక భూత వైద్యుడి గురించి విన్నది. అతని వద్దకు వెళ్తే పిల్లలు పుడతారని తెలిసినవాళ్లు చెప్పడంతో భార్యాభర్తలు ఇద్దరు భూత వైద్యుడి వద్దకు వెళ్లారు. వీరి సమస్య విన్న భూత వైద్యుడు నరబలి చేస్తే తప్పకుండ పిల్లలు పుడతారని చెప్పాడు. పిల్లల కోసం ఎంతటి పనికైనా ఒప్పుకొంటామని భార్యాభర్తలు తెగేసి చెప్పారు. దీనికోసం బంటు బౌథేరియా తన స్నేహితుడైన నీరజ్ సహాయం తీసుకున్నాడు.
నరబలి కోసం ఎవరినైనా తీసుకురావాల్సిందిగా కోరడంతో నీరజ్ , ఒక వేశ్య గృహానికి వెళ్లి రూ. 10 వేలు పెట్టి ఒక వైశ్యను వెంటబెట్టుకొచ్చాడు. ఒక రూమ్ కి తీసుకెళ్లి ఆమెతో శృంగారంలో పాల్గొని ఆమెను హతమార్చాడు. అనంతరం ఆమె శవాన్ని బైక్ పై భూత వైద్యుడు వద్దకు తీసుకెళ్లగా ఆమె అప్పటికే మద్యం సేవించి ఉందని, నరబలికి పనికి రాదని చెప్పడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో భయపడ్డ రంజిత్ ఆ శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మరోరోజు కూడా మరో వేశ్యతో శృంగారం చేసి ఆమెను హతమార్చి నరబలి ఇచ్చారు. రోడ్డుపై వేశ్య శవం దొరకడంతో పోలీసులు విచారించగా ఈ దారుణ నిజం వెలుగులోకి వచ్చింది. వేశ్య కాంటాక్ట్ నంబర్స్ లో నీరజ్ ఉండడంతో అనుమానించిన పోలీసులు తమదైన రీతిలో అతడిని విచారించగా, నిజం బయటపెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బంటు బౌథేరియా, మమత జంటను, భూత వైద్యుడిని, వీరికి సహాయం చేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పిల్లల కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ జంట కేసు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారింది.