Tragedy In Prakasam: కన్నతండ్రి అంటే.. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఆ పిల్లల పాలిట వాళ్ల తండ్రే కాలయముడయ్యాడు. అత్యంత దారుణంగా వారిని చంపేసి..పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి చనిపోయిన ఘటన.. ప్రకాశం జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలకలం సృష్టించింది. అతని పేరు గుత్తా వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లి స్వస్థలం. అక్కడే ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య దీపికతోపాటు మోక్షిత, రఘువర్షిణి, శివధర్మ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు…
పెళ్లైన దగ్గర నుంచి వారి సంసారం సాఫీగానే సాగుతోంది. ఐతే ఈ మధ్య భార్య, భర్తకు పడటం లేదు. రోజూ ఇంట్లో గొడవలు పడుతున్నారు. భార్య దీపికకు కొద్ది రోజుల క్రితం వీఏఓగా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయ్యాయి. ఆగస్టు 30న కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై అలిగిన వెంకటేశ్వర్లు… స్కూలు నుంచి పిల్లలు రాగానే వారిని తీసుకుని బైక్‌పై వెళ్లిపోయాడు…
వాళ్లు వెళ్తున్న సమయంలో భార్య దీపిక ఎదురు వచ్చింది. ఐతే బస్టాండ్ వద్దకు వెళ్లి పిల్లలకు చాక్లెట్లు కొనిచ్చి తీసుకు వస్తానని నమ్మబలికాడు వెంకటేశ్వర్లు. అలా పిల్లలతో వెళ్లిన అతడు రాత్రి వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, బంధువుల వద్ద విచారణ చేసింది దీపిక. కానీ అతడూ, పిల్లలు ఎంతకూ తిరిగిరాకపోవడంతో సెప్టెంబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. వెంకటేశ్వర్లు మొబైల్ లొకేషన్ ఆధారంగా విచారణ చేశారు. అతడు శ్రీశైలం, సున్నిపెంట మీదుగా వెళ్లినట్లు గుర్తించారు..
చివరకు.. వెంకటేశ్వర్లు వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలోని చెరువు వద్ద శవమై తేలాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ కేసులో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టీమ్స్‌గా ఏర్పడి పిల్లల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వర్షిణి, శివ ధర్మ డెడ్ బాడీలు అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం సూర్యాతాండ సమీపంలో లభ్యమయ్యాయి. వారిని చంపేసి పెట్రోల్ పోసి తగలపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మరో చిన్నారి కోసం డ్రోన్ల సాయంతో వెతికారు లోలీసులు. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకూతురు మోక్షిత మృతదేహం లభించింది…
ముగ్గురు పిల్లలు, వెంకటేశ్వర్లు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. అసలు చిన్నారులను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? కుటుంబ కలహాల కోసమే చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడా? భార్య దీపిక చెప్పే మాటల్లో నిజమెంత? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
READ ALSO: CM Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన సీఎం.. వైద్యులు ఏమన్నారంటే