Fake Currency Gang: కోనసీమ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. 12 మంది నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్.. హనుమాన్ జంక్షన్‌కు సమీపంలోని వీరవల్లి గ్రామంలో NMS ఎంటర్‌ప్రైజెస్ పేరుతో సంస్థ నడుపుతున్నాడు. అయితే, దొంగనోట్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్, స్కానర్, కలర్ పింటర్, జిరాక్స్ మిషన్లను సమకూర్చుకున్నాడు. అసలు ఏదో..? నకిలీ ఏదో..? గుర్తించలేని రీతిలో ఐదొందల రూపాయల నోట్లను ముద్రించడం ప్రారంభించాడు. రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ళ వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవ రెడ్డిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో నకిలీ నోట్లను చలామణీ చేయడం ప్రారంభించాడు.
Read Also: TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు.. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ..
అయితే, ఇటీవల షేక్ మస్తాన్ ఇచ్చిన 50 వేల రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను యాక్సిస్ బ్యాంక్ ATMలో డిపాజిట్ చేశాడు సత్యనారాయణ. అయితే, వాటిని నకిలీ నోట్లుగా గుర్తించిన ATM… బ్యాంక్ అధికారులకు అలర్ట్ పంపింది. మరోవైపు… తాను డిపాజిట్ చేసిన 50 వేల రూపాయలు అకౌంట్లో జమ కాలేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణ. ఓ వైపు ATM నుంచి అలెర్ట్ రావడం… ఆ డబ్బు తనదేనంటూ సత్యనారాయణ బ్యాంకు రావడంతో అధికారుల పని సులువైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగ నోట్ల దందా బట్టబయలైంది. ఇక ఈ వ్యవహారంలో సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీర రాఘవ రెడ్డి, షేక్ మస్తాన్‌తో పాటు మొత్తం 12 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులంతా ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్లే. అలాగే, పరారీలో ఉన్న ఇంకొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. దొంగ నోట్ల ముద్రణ కోసం ఉపయోగించిన పరికరాలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే, చెలామణికి సిద్ధం చేసిన లక్షా 33 వేల రూపాయలు విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.