Bengaluru: బెంగళూర్‌లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు. 38 ఏళ్ల అనుమానితుడు ‘‘పరివాల మంజా’’గా పిలువబడే మంజునాథ్‌ని పోలీసులు గుర్తించారు. హోసూర్‌కి చెందిన మంజునాథ్ బెంగళూర్‌లోని నాగరత్‌పేటలో నివాసం ఉంటున్నాడు. సిటీలో జరిగిన దాదాపు 50 చోరీల వెనక ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Read Also: EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
మంజునాథ్ సింపుల్ టెక్నిక్‌తో దొంగతనాల్ని ప్లాన్ చేసే వాడు. ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లను, సెక్యూరిటీ లేని బహుళ అంతస్తుల భవనాలను టార్గెట్ చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న చోటుకు తన పావురాలతో అక్కడి వచ్చేవాడు. వాటిని అక్కడ విడిచిపెట్టేవాడు. ఇలా విడిచిపెట్టిన పావురాలు సహజంగా బిల్డింగ్స్ బాల్కనీ లేదా పైకప్పుపై వాలేవి. ఆ తర్వాత మంజునాథ్ పావురాల సాకుతో సదరు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించేవాడు. ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను తన పావురాలను పట్టుకునేందుకు వచ్చానని చెప్పేవాడు.
తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇనుపరాడ్‌ని ఉపయోగించి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడేవాడు. ఇలా దొంగిలించిన వస్తువుల్ని హోసూర్‌లో అమ్మేవాడు. గతంలో అనేక సార్లు అరెస్టయినప్పటికీ, బెయిల్‌పై తిరిగి వచ్చి మళ్లీ నేరజీవితం ప్రారంభించేవాడు. మంజునాథ్ ఒంటరిగానే దొంగతనం చేసేవాదని, పగటిపూట ప్రజలు పనుల్లో ఉన్నప్పుడే చోరీలకు పాల్పడే వారని పోలీసులు వెల్లడించారు.