Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!

Meerpet Police

Meerpet Police

రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో వెలుగుచూసింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్, రికవరీ చేసిన బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌పై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

సీజ్డ్ సొత్తుపై కన్నేసి..
వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్, గతంలో ఓ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సొత్తుపై కన్నేశాడు. ఆ కేసులో సీజ్ చేసిన నిందితుడి మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా ఏకంగా రూ.1,70,000 (లక్షా డెబ్బై వేల రూపాయలను) తన బంధువుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు.

12 తులాల బంగారం తాకట్టు
అంతటితో ఆగకుండా, అదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకుని భద్రపరిచిన 12 తులాల బంగారు ఆభరణాలను సైతం గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులు/సంస్థల వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడు. ఈ అవకతవకలు బయటపడటంతో స్టేషన్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ చేతివాటం బట్టబయలు కావడంతో అతనిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.