Crime: రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్‌లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్యమైంది. అతడితో వచ్చిన మహిళ కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also: RG Kar Doctor case: సంజయ్‌రాయ్‌కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
భండారీకి అప్పగికే వివాహమైంది, అతడి కుటుంబం జాలోర్‌లో నివసిస్తోందని డీసీపీ పంజక్ కుమార్ సింగ్ తెలిపారు. కామ్తాలోని హోటల్ సాఫ్రాన్‌లో సోమవారం ఇతడి మరణం గురించి స్థానిక చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. ప్రాథమిక విచారణ తర్వాత పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరణానికి అసలు కారణం వెల్లడికానుంది.
హోటల్ గదిలో బాత్రూంలో భండారీ మృతదేహం నగ్నంగా కనిపించింది. అతడితో వచ్చిన మహిళ సమాచారాన్ని కనుక్కునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా హోటల్ సిబ్బంది మరియు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.