Ex-servicemen Murder Case: విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది..గాజువాక జగ్గు జంక్షన్ కి సమీపంలో శ్రీకృష్ణానగర్‌లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత ఘోరంగా గొంతుకోసి, చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు గాజువాక పోలీసుస్టేషన్‌లో లొంగిపోవడం కలకలం రేపింది. స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ హత్యకు దారి తీసిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి..
Read Also: Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
పాత కర్నవానిపాలేనికి చెందిన వేమిరెడ్డి అప్పలనాయుడు ఆర్మీలో పని చేసి వచ్చారు. తరువాత అనారోగ్య కారణాలతో కాళ్లు చచ్చుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. భార్య సుజాత, నాలుగేళ్ల కుమారుడితో నివసిస్తున్నారు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంక అశోక్‌లతో 2016 నుంచి గొడవలు ఉన్నాయి. తమ మాట వినడం లేదని ప్లాన్ ప్రకారం మట్టుబెట్టాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఇక, దివ్యాంగ వాహనంపై వస్తున్న అతనిపై రాము, అశోక్ ఒక్కసారిగా దాడికి దిగి కత్తితో మెడ, చేతులను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయారు. మోచేయి, ఇతర అవయవాలు తెగి మూడు అడుగుల దూరంలో పడటం గమనిస్తే నిందితులు ఎంత పాశవికంగా వ్యవహరించారో అర్థమవుతోంది. అప్పలనాయుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక నిందితులిద్దరూ నేరుగా గాజువాక పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. స్థల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఇలా చేసినట్లు నిందితులు చెప్పుకొస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఓదార్చి వివరాలను సేకరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.