Kerala Girlfriend Greeshma Killed Her Boyfriend Sharon: తనకు దక్కలేదన్న కోపంతోనో లేక వేధిస్తున్నాడన్న ఆవేదనతోనో.. ప్రియుడ్ని ప్రియురాలు చంపిన ఘటనల్ని మనం చూశాం. కానీ.. కేరళలో మాత్రం జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని, బ్రేకప్ చేసుకున్న ప్రియుడ్ని మళ్లీ ముగ్గులోకి దింపి మరీ చంపేసింది ఓ యువతి. తిరువనంతపురంలో సంచలనం రేపుతున్న ఈ హత్య కేసు వివరాల్లోకి వెళ్తే.. పరసాలాకు చెందిన షరోన్ రాజ్‌కు రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన గ్రీష్మాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే.. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీంతో.. ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇంకెప్పుడు కలవకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తర్వాత.. గ్రీష్మాకి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి నచ్చడంతో, అతనితో పెళ్లి ఫిక్స్ చేశారు. చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ, చివరి నిమిషంలో పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. తమ జాతకాలు ఏమైనా తేడా ఉన్నాయేమోనన్న అనుమానంతో.. గ్రీష్మా ఓ జ్యోతిష్యుడ్ని సంప్రదించింది. అప్పుడు జ్యోతిష్యుడు మొదటి భర్త చనిపోతాడని గ్రీష్మాకి జోస్యం చెప్పాడు. దీంతో.. గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్లాన్ మార్చేశారు. షరోన్‌ని మళ్లీ ముగ్గులోకి దింపమని కుటుంబీకులు చెప్పడంతో.. ఆమె మళ్లీ అతనితో మాటలు కలిపింది. నిన్ను విడిచిపెట్టి ఉండలేనట్టు అతనికి దగ్గరైంది. పెళ్లి చేసుకుందామని కూడా నమ్మించింది. పాపం.. ఆమె ప్రేమలో షరోన్, గుడ్డిగా అన్నీ నమ్మేశాడు.
కట్ చేస్తే.. పెళ్లి చేసుకుందామని చెప్పి, కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్‌ని రప్పించింది గ్రీష్మా. సాంప్రదాయం ప్రకారం.. కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత.. ఇంట్లోనే స్నేహితులతో కలిసి, కూల్‌డ్రింగ్ తాగే పోటీ నిర్వహించారు. ఒక ఆయుర్వేదిక్ డ్రింక్‌లో గ్రీష్మా విషం కలిపి, ప్రియుడికి ఇచ్చింది. అది తాగిన షరోన్.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 14 రోజుల పాటు ఒక్కో అవయవం పని చేయకుండా చివరికి చనిపోయాడు. షరోన్ చనిపోయాక, తనకు పెళ్లి నిశ్చయమైన వ్యక్తిని వివాహమాడి, హాయిగా పెళ్లి చేసుకోవాలనే ఈ పన్నాగం పన్నింది. పెళ్లైన 14 రోజుల్లోనే తమ కుమారుడు చనిపోవడంతో.. షరోన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఈ గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యుల బాగోతం బయటపడింది.