Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..

  • కర్ణాటకలో దారుణం..
  • భార్యను ఉరితీసి హత్య చేసిన భర్త..
  • చివరి క్షణాలను వీడియో‌కాల్‌లో తల్లిదండ్రులకు చూపించిన కసాయి..
Karnataka Crime

Karnataka Crime

Karnataka: కట్టుకున్నవాడే కసాయిగా మారాడు. వివాహేతర సంబంధం ఉందని అనుమానించి భర్త, భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె చనిపోతున్న చివరి క్షణాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లో జరిగింది. మృతురాలని భాగ్యశ్రీ జిగలూర్‌‌గా గుర్తించారు. ఆమె భర్త ప్రవీణ్ జిగలూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని గలగలి గ్రామంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.

ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేసి, ఆ తర్వాత ఇంట్లోనే ఉరి వేసి హత్య చేశాడు. ఆమె ఉరికి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో, ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కుమార్తె చివరి క్షణాలను చూపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను రికార్డ్ చేసి చాలా మందికి షేర్ చేసినట్లు విచారణలో తేలింది. కుటుంబ కలహాలతో భాగ్యశ్రీ గత రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. గొడవలు పెట్టుకోమని నమ్మించిన ప్రవీణ్, ఆమెను ఇంటికి తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.