Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..

Online Cybersecurity Course

Online Cybersecurity Course

సాంకేతికత ఎంతగా పెరుగుతోందో, దానికి తోడుగా సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల పేరిట నకిలీ సందేశాలు పంపి నిలువునా ముంచేసే కొత్త రకం సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటనే దీనికి నిదర్శనం. మన అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని చెప్పడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరిక.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక దారుణమైన సైబర్ మోసం వెలుగుచూసింది. ఇక్కడికి చెందిన మజ్హర్ అనే వ్యక్తి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా ఒక సందేశం వచ్చింది. అది రవాణా శాఖ నుంచి వచ్చిన “ఈ-చలాన్” లాగా కనిపించింది. వాహనానికి చలాన్ పడిందని నమ్మిన ఆయన, ఆ మెసేజ్‌తో పాటు వచ్చిన apk ఫైల్‌ను క్లిక్ చేసి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేశారు. అంతే, ఆ యాప్ ఇన్‌స్టాల్ అయిన కొద్దిసేపటికే, ఆయనకు తెలియకుండానే ఆయన ఫోన్ పే ఖాతా నుండి ఏకంగా రూ.95,100 నగదు విడతల వారీగా మాయమైపోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

×
×
Ad

ఈ రకమైన మోసాలను “Apk Malware Scam” అంటారు. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ లేదా కొరియర్ సర్వీస్ పేరిట నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి, వాటితో పాటు యాప్ ఫైళ్లను పంపుతారు. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా, బయట నుండి ఇలాంటి ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయగానే మన ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ దొంగల చేతికి వెళ్తుంది. దీనివల్ల మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సమాచారాన్ని వారు సులభంగా దొంగిలించి, మన అకౌంట్ లోని డబ్బును కాజేస్తారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే ఎటువంటి లింకులను లేదా యాప్ ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదు. మీ వాహనానికి చలానా ఉందో లేదో తెలుసుకోవడానికి రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వాడాలి. ఏ రకమైన యాప్స్ అయినా సరే కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాట్ గా సైబర్ మోసానికి గురైతే, వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.