Karnataka: కులాంతర ప్రేమలు పెను విషాదాలను మిగులుస్తున్న సంఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో గల మెలకుంద గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, ఆమెను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారాణ జరిపి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
Read Also: Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
తీరు మార్చుకోని కూతురు..
అయితే, మెలకుంద గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కులాంతర వివాహం జరిగితే మిగతా కుమార్తెల పెళ్లిళ్లు ఆగిపోతాయన్న భయం అతడ్ని వెంటాడింది. దీంతో కూతురిని ఒప్పించేందుకు బంధువుల సహాయం తీసుకున్నప్పటికీ, ఆమె తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: Russia: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ..
ఇక, గురువారం నాడు తన కూతురిని గొంతు నులిమి చంపిన శంకర్, ఆ తర్వాత ఆమె నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. గ్రామస్థులు కూడా అది ఆత్మహత్యే అని భావించి అంత్యక్రియలను కూడా నిర్వహించారు. కానీ, ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో, కలబుర్గి పోలీసు కమిషనర్ శరణప్ప ఎస్డీ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
Read Also: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
బయటపడ్డ నిజం:
కాగా, మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఇది హత్యేనని నిర్ధారించింది. దీంతో పోలీసులు మృతురాలి తండ్రి శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కులాంతర వివాహం కారణంగా తన కుటుంబ పరువు పోతుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డానని శంకర్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు హత్య, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసుల్లో అరెస్టు చేశారు. ఈ ఘటనలో శంకర్ బంధువులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, వారు దోషులని తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని కలబుర్గి కమిషనర్ శరణప్ప ఎస్డీ తెలిపారు.