జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల విచారణ జరుగుతోంది. బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇంటిదగ్గర దింపుతామని బాధితురాలిని ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితులే తనను బలవంతం చేశారని బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్‌లో వెల్లడైంది. పబ్ నుండి బయటికి వచ్చిన తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిందని బాధితురాలు తెలిపింది. తనను పబ్‌కి తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోపలే ఉన్నాడని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయలేదని బాధితురాలు తెలిపింది. అప్పటికే నిందితులు తనను ఫాలో అయ్యారని, క్యాబ్ బుక్ చేస్తామంటూ తన ఫోన్ లాక్కున్నారని బాధితురాలు తెలిపింది. ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా లేదని తామే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ.. తనను బెంజ్ కారులో ఎక్కించుకున్నారని తెలిపింది.
పబ్ నుంచి బెంజ్ కారు బంజారాహిల్స్ కాన్స్ బేకరి దగ్గరకు వెళ్లిందని, కారులో ఉన్నప్పుడే నిందితులు తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారని బాధితురాలు పేర్కొంది. ఆదే సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బెంజ్ కారు ఇరుకుగా ఉందంటూ ఇన్నోవా కారులోకి మార్చారని తెలిపింది. తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు ఇస్తారేమోనని కారులోకి వెళ్లానని, ఇన్నోవా కారులోనే నిందితులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది.
Jubilee Hills Case: బాలికపై గ్యాంగ్ రేప్.. ఆ గంటన్నర ఏం జరిగింది..?
ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని.. నేటి నుంచి అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. ఇదే ఘటనకు సంబంధించి జువైనల్ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే లభించిన ఆధారాలతో పాటు.. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు.