జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా సర్వీసింగ్ చేయించారని తేలింది.
అయితే.. ఆ ఇన్నోవా కారులో ప్రింట్స్, ఇతర క్లూస్ దొరుకుతాయన్న ఉద్దేశంతో నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు.. బెంజ్ కారులో మాత్రం అమ్మాయి చెప్పులు, ఇయర్ రింగ్స్‌తో పాటు మరికొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇదిలావుండగా.. ఈ కేసులో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఆ బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగానే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో A6గా ఎమ్మెల్యే కొడుకు పేరు నమోదయ్యే అవకాశం ఉంది. బయటకొచ్చిన వీడియోతో పాటు బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం.. పోలీసులు లీగల్ ఒపీనియన్ ఒపీనియన్ తీసుకోనున్నారు. పోక్సో చట్ట ప్రకారం.. బాధితురాలి స్టేట్‌మెంటే ఫైనల్ కానుంది.