Sahasra murder case: నేరం చేయాలనే ఆలోచన వస్తే.. చేసేస్తారా? దానికి వయసుతో సంబంధం ఉండదా? కూకట్‌పల్లి సహస్ర మర్డర్ కేసులో ఇదే జరిగిందా? పక్కా మర్డర్ ప్లాన్ లేకపోయినా.. అడ్డం వస్తే అంతం చేయాలనే నిందితుని ధోరణి.. సహస్ర ప్రాణాలు బలిగొందా? అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది? పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలేంటి? అసలు నిందితుడు దేని కోసం అత్యంత కిరాతకంగా అమ్మాయిని చంపేశాడు? మైనర్ బాలుడు క్రూరంగా చంపడం వెనుక కారణాలేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? హైదరాబాద్ కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. 15 ఏళ్ల పక్కింటి బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేపర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సహస్ర తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు.
READ ALSO: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కేసు
మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో 5 రోజులపాటు మిస్టరీ వీడలేదు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. హంతకులు ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతేకాదు కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. హంతకుల కోసం 5 బృందాలు ఏర్పాటు చేశారు. వందల మందిని ప్రశ్నించారు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతేకాదు కొన్ని వేల ఫోన్లను ట్రాకింగ్ చేశారు. దాదాపు 10 సెల్ ఫోన్ టవర్ లొకేషన్లలో ఉన్న ఫోన్లను ట్రాక్ చేశారు. కానీ ఎక్కడా చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. చివరకు చిన్న క్లూతో నిందితున్ని పట్టుకున్నారు పోలీసులు…
సహస్ర ఇంటి పక్కనే ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన చిన్నపాటి క్లూతో పోలీసులు కేసును ఛేదించారు. ఇదంతా చేసింది పక్కింట్లో ఉండే ఓ 15 ఏళ్ల బాలుడిగా తేలింది. అతన్ని పట్టుకుని విచారించారు పోలీసులు. ఆ సమయంలో సైతం అతను తాను ఏమీ చేయలేదని బెరుకుగా సమాధానం చెప్పాడు. కానీ బాలుడి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు ఓ చీటి దొరికింది. అందులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. ఆ పేపర్‌ను నెల రోజుల ముందే ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చివరకు.. ఆ పేపర్ ను ముందు పెట్టి గట్టిగా ప్రశ్నించే సరికి తానే హత్య చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. నిందితుడి ఇంట్లో హత్య సమయంలో అతను ధరించిన టీ షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మైనర్ కిల్లర్ వ్యవహారం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. సాక్ష్యాలతో సహా నిందితుడిని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..
మరోవైపు సహస్రను ఇంత దారుణంగా చంపేసిన బాలున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు. తమ కూతురుకు న్యాయం చేయాలని వాపోయారు. వారు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫలితంగా సహస్ర తల్లిదండ్రులు, ఇతర బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. సహస్రను అంత కిరాతకంగా చంపేయడంపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడు తమ ఇళ్ల పక్కనే ఉంటూ ఎంత దారుణానికి పాల్పడ్డాడని చర్చించుకుంటున్నారు. అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా చేయాలని పోలీసులను కోరుతున్నారు.
READ ALSO: Fake notes: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల దందా.. ఎన్ని లక్షలు ప్రింట్ చేశారంటే..