Hyderabad Child Torture: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లో కన్నతల్లి.. ఓ కూతురు పట్ల రాక్షసంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి కూతురును హింసించింది. ఒంటిపై వాతలు వచ్చేలా కొట్టడమే కాదు… ఏకంగా గోళ్లు పీకేసి.. వేళ్లలో కారం పోసి నరకయాతనకు గురి చేసింది. స్థానికుల ఫిర్యాదుతో కన్నతల్లితోపాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
READ ALSO: Crime News: వీడు అసలు మనిషేనా.. కట్టుకున్న భార్యను ఇటుకలతో కొట్టి చంపిన కసాయి భర్త!
ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో నివసించే షబానా నజ్వీమ్ తన మొదటి భర్త తాజుద్దీన్‌తో విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆమె జోగిపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎండీ జావేద్‌తో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది కాలానికే ఈ జంట చిన్నారులపై హింసకు పాల్పడటం ప్రారంభించింది… ఈ నెల1 న చిన్నారి శరీరంపై గాయాలను గమనించిన స్థానికులు ఆరా తీశారు. తల్లి, సవతి తండ్రి ప్రతిరోజూ కొడుతున్నారని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని చిన్నారి కన్నీళ్లతో తెలిపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి శరీరంపై.. వైర్‌తో కొట్టిన మచ్చలు, గోళ్లు పీకి వాటి గాయాల్లో కారం రాసిన బాధాకరమైన పరిస్థితులను చూసి దిగ్భ్రాంతి చెందారు. చిన్నారి చెంపలపై, శరీరంలోని పలు భాగాలపై వాతలు స్పష్టంగా కనిపించాయి…
నజ్వీమ్, జావేద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
తదుపరి చర్యల్లో భాగంగా పోలీసులు నజ్వీమ్, జావేద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేధింపులకు గురైన ఇద్దరు పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తమ సంరక్షణలోకి తీసుకుంది. రెండు రోజుల తర్వాత చిన్నారి తండ్రి, బాబాయ్ వచ్చి వారిని ఇంటికి తీసుకెళ్లారు… ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లే ఇంత అమానవీయంగా ప్రవర్తించడాన్ని ఖండించారు. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు…
READ ALSO: Pakistan US Deal: అమెరికాకు పాక్ దాసోహం.. గుట్టుచప్పుడు కాకుండా అరుదైన ఖనిజాల తరలింపు