Pakistan US Deal: అగ్రరాజ్యానికి పాకిస్థాన్ ప్రభుత్వం దాసోహం అయ్యిందని సొంత దేశంలోనే ప్రజలు విమర్శలు విమర్శిస్తున్నారు. దేశంలోని అరుదైన ఖనిజాల తొలి షిప్‌మెంట్‌ను పాక్ అమెరికాకు పంపింది. ఈ షిప్‌మెంట్‌లో నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి. యాంటిమోనీ, రాగి కూడా ఎగుమతి చేశారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తాజా ఎగుమతితో దాయాది దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) పార్టీ.. ప్రభుత్వం పార్లమెంటరీ ఆమోదం లేకుండా అమెరికాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బాహాటంగా ఆరోపిస్తోంది.
READ ALSO: Flipkart Sale 2025: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై రూ. 23 వేల డిస్కౌంట్.. మిస్ చేసుకోకండి
పాక్- యూఎస్ ఒప్పందాలను చెప్పాలి..
షాబాజ్ ప్రభుత్వం యూఎస్‌తో చేసుకున్న అన్ని వివరాలను బహిరంగపరచాలని PTI డిమాండ్ చేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 8న అమెరికన్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM), పాకిస్థాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO) మధ్య ఇస్లామాబాద్‌లో ఒక ఒప్పందం కుదిరింది. ఈనేపథ్యంలో అమెరికన్ కంపెనీతో షాబాజ్, మునీర్ రెండు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందాల ప్రకారం.., యాంటిమోనీ, రాగి, బంగారం, టంగ్‌స్టన్, అరుదైన భూమి మూలకాలు వంటి కీలకమైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేస్తారు. అలాగే పాక్‌లో మైనింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
ఓడరేవును ఇవ్వడానికి సిద్ధపడిన పాక్..
పాకిస్థాన్ నుంచి వచ్చే మొదటి షిప్‌మెంట్ అమెరికాతో సరఫరా గొలుసు స్థాపించడంలో ఒక ప్రధాన మలుపుగా నిలుస్తుందని ఇరు దేశాలు అభివర్ణించాయి. ఇది పాకిస్థాన్ ఆదాయాన్ని పెంచుతుందని, దేశంలో ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రస్తుత పాలకులు చెబుతున్నారు. మొదటి షిప్‌మెంట్ డెలివరీని పాకిస్థాన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా యుఎస్‌ఎస్‌ఎం పేర్కొంది. ఖనిజ ఎగుమతులను సులభతరం చేయడానికి పాక్ పాస్ని ఓడరేవును అమెరికాకు అప్పగించడానికి కూడా ముందుకొచ్చిందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఓడరేవు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో ఉంది.
అమెరికా అధ్యక్షుడికి అరుదైన ఖనిజాలు గిఫ్ట్..
సెప్టెంబర్‌లో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ట్రంప్‌కు అరుదైన మట్టి, విలువైన రాళ్లతో కూడిన పెట్టెను బహుకరించారు. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో అరుదైన మట్టి ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. పాక్ ఖనిజ సంపద సుమారు $6 ట్రిలియన్ల విలువైనదిగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఖనిజాలను వాణిజ్యపరంగా పరిమిత స్థాయిలోనే ఉపయోగించారు. పీటీఐ ప్రెస్ సెక్రటరీ షేక్ వకాస్ అక్రమ్ మాట్లాడుతూ.. మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1615లో సూరత్ ఓడరేవులో బ్రిటిష్ వారికి వాణిజ్య హక్కులను మంజూరు చేశాడని, ఇది తరువాత వలసరాజ్యాల నియంత్రణకు దారితీసిందని అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాల నుంచి బుద్ధి నేర్చుకోవాలని హితవుపలికారు.
READ ALSO: India Hypersonic Missile: పాక్ గుండెల్లో బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమైన ‘ధ్వని’..