Hyderabad Man Cheated Software Engineer In The Name Of Investment: సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. మాయమాటలతో మహిళలతో పరిచయం పెంచుకొని, వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకుంటారు. మహిళలు సైతం వారి మోసాన్ని పసిగట్టలేక.. వారి వలలో చిక్కుకుంటుంటారు. కొందరు తెలివిగా తప్పించుకుంటారు కానీ, మరికొందరు మాత్రం అసలు విషయాన్ని గ్రహించేలోపే మోసపోతారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా.. ఈ సోషల్ మీడియా మోసానికి టార్గెట్ అయ్యింది. తనకున్న పెయింటింగ్ మోజులో, తాను మోసపోతున్నట్టు ఆమె గ్రహించలేకపోయింది. చివరికి తాను మోసపోయిన విషయాన్ని అర్థం చేసుకొని.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నివాసం ఉండే ఒక మహిళ.. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఖాళీ సమయాల్లో ఈమెకు పెయింటింగ్ వేయడం అలవాటు ఉంది. ఆ చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన ఓ కేటుగాడు, ‘మీరు వేసిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి’ అంటూ మాటలు కలిపాడు. ఈ క్రమంలోనే ఆమెను ఎన్‌ఎఫ్‌టీ ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్ వైపుకి రప్పించాడు. ఆ వెబ్‌సైట్‌లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని.. మీ పెయింటింగ్స్ అందులో పెడితే మంచి గిరాకీ వస్తుందని నమ్మించాడు. అయితే.. ఆ వెబ్‌సైట్‌లో ముందుగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని, ఆ తర్వాత పెయింటింగ్స్‌కి డిమాండ్ వస్తే లక్షలు వస్తాయని చెప్పాడు.
ఆ కేటుగాడి మాటలు నమ్మిన ఆ ఇంజినీర్.. ఆ వెబ్‌సైట్‌లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఇంకేముంది.. తాను వేసిన గాలంలో చేప చిక్కిందనుకొని, అతడు ఆమె నుంచి మరింత డబ్బు లాగాడు. లాభాలు రావాలంటే.. ట్యాక్స్‌లు, కమీషన్‌లు కట్టాలంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 8 లక్షలు దోచేశాడు. ఇంకా ఏవేవే పేర్లు చెప్తూ, వాటిక్కూడా డబ్బులు కట్టాలని అతడు వెంటపడటంతో.. ఆమెకి డౌట్ వచ్చింది. చివరికి తాను నిండా మోసపోయానని గ్రహించి.. సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.