Murder Mystery: ఎలాంటి ఆధారాలు లేని ఒక హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులకు ‘‘ఈగలు’’ సాయపడ్డాయి. తన మామని చంపిన కేసులో 19 ఏళ్ల యువకుడిని పట్టించాయి. చివరకు ఈగల వల్ల యువకుడు తాను చేసిన హత్యా నేరాన్ని ఒప్పుకున్నాడు. సరైన సాక్ష్యాధారాలు లేకున్నా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
ఏం జరిగింది..?
దీపావళి సందర్భంగా అక్టోబర్ 30న మనోజ్ ఠాకూర్ అలియాస్ మన్ను(26), అతని మేనల్లుడు ధరమ్ సింగ్(19) ఇద్దరూ కలిసి మద్యం తాగి విందు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. అయితే, దీని తర్వాత ధరమ్ సింగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ, మనోజ్ కుమార్ రాలేదు. తర్వాతి రోజు బబల్‌పూర్ నగర శివార్లలో అతని మృతదేహం కనిపించింది.
Read Also: Wedding Season: వచ్చే నెల రోజుల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్ల వ్యాపారం..
మేనల్లుడి విచారణ..
మనోజ్ కుమార్‌తో చివరిసారిగా ధరమ్ సింగ్ మాత్రమే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని విచారించారు. అయితే, తొలిసారి విచారణలో తనకు ఏం తెలియదని చెప్పాడు. పోలీసులు కూడా అతడిని అనుమానించలేదు. హత్యకు ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ, దోపిడీ ఆనవాళ్లు ఏమీ లేవు. మరోసారి ధరమ్ సింగ్‌ని విచారించాలని పోలీసులు భావించారు. అయితే, ఆ సమయంలోనే వింత జరిగింది. విచారణ గదిలో పోలీసులు ఉండగా, వారిని కాదని ఈగలు ధరమ్ సింగ్ చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఎంతగా వాటిని పారద్రోలేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి ధరమ్ సింగ్ చూట్టూనే తిరిగాయి.
దీంతో అనుమానించిన చార్గవాన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అభిషేక్ పయాసికి అనుమానం కలిగింది. అతడి చొక్కాను పరీక్షల కోసం పంపాడు. డార్క్ కలర్ చొక్కా కావడంతో కళ్ల ద్వారా రక్తపు మరకల్ని గుర్తించలేదు. పరీక్షల్లో మాత్రం చొక్కాపై రక్తపు మరకలను గుర్తించారు. చివరకు గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు ధరమ్ సింగ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మద్యం తాగిన తర్వాత, ఆహారం కోసం ఎక్కువ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుందని, చెక్కతో మనోజ్ ఠాకూర్‌ని కొట్టినట్లు ధరమ్ సింగ్ చెప్పాడు. హత్యకు ఉపయోగించిన చెక్క ముక్కను నేరస్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.