కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కూడా వెనుకాడ లేదు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఉంటున్న జక్కు లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు చాలా కాలం క్రితమే వివాహమైంది. ఇటీవలే భర్త మృతి చెందాడు. కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ భార్యతో కలిసి వేరే కాపురం ఉంటున్నాడు కొడుకు శివాజీ. ఐతే లక్ష్మీ నరసమ్మ మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆమెను వాటి కోసం వేధిస్తున్నాడు..
నిజానికి శివాజీ.. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కానీ తన పని మానేసి.. ఆస్తులు కావాలని తల్లి వెంట పడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో కొయ్యలగూడెంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తల్లిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా రక్తస్రావంతో అక్కడే ఆమె కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు… తల్లి లక్ష్మీనరసమ్మపై హత్యా యత్నం చేసిన కొడుకు శివాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఆస్తుల కోసం కన్న తల్లి మీద దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.