AP Crime: నెల్లూరులో కాల్పుల వ్యవహారంలో కలకలం సృష్టించింది.. నగరంలోని ఆచారి వీధిలో తండ్రి కొడుకుల మధ్య వివాదం కాస్తా.. తుపాకీ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన రాజమౌళి జైన్ చాలా సంవత్సరాల క్రితం నెల్లూరుకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.. వీరిలో రెండో కుమారుడు హితేష్ కుమార్ జైన్ చెడు వ్యసనాల బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి శిఖరం వారి వీధిలో నివాసం ఉంటున్నారు. వ్యాపారం కోసం ఇప్పటికే తండ్రి.. హితేష్ కుమార్ కు 40 లక్షల రూపాయల వరకు నగదు ఇచ్చారట.. ఆ నగదుతో వ్యాపారం చేసినా నష్టం రావడంతో తనకు మరిన్ని డబ్బులు కావాలని హితేష్ కుమార్ పదేపదే తండ్రిని అడుగుతూ వచ్చాడు. అంతేకాక ఆస్తిలో వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
Read Also: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్
ఈనెల 11వ తేదీన మరోసారి తండ్రి.. కుమారుల మధ్య వివాదం జరిగింది. ఆస్తి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తుపాకీతో కాల్చుకునేందుకు ప్రయత్నం చేశాడు హితేష్ కుమార్ జైన్.. అప్పట్లో తుపాకీ పాలకపోవడంతో ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి మిత్రులతో కలిసి తండ్రి ఇంటికి వచ్చిన హితేష్.. తలుపులు తెరవాలని కోరాడు. ఇంటిలోకి వచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఇంటి డోర్లపై కాల్చాడు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టించింది.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని హితేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హితేష్ వాడిన గన్ కు లైసెన్స్ ఉందని… బంగారం వ్యాపారం చేస్తున్నాడంతో ఆత్మరక్షణ కోసమని గన్ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.