Delhi: పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్‌ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఛార్జిషీట్ ప్రకారం.. సందీప్ మాలిక్ సెప్టెంబర్ 29న సివిల్ దుస్తుల్లో నైట్ డ్యూటీ నిర్వహిస్తుండగా, నంగ్లోయ్ ప్రాంతంలో కారులో ధర్మేందర్(39), రజనీష్(25) మద్యం సేవించడాన్ని గమనించాడు. నిందితులిద్దర్ని మందలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు సందీప్ మాలిక్ బైక్‌ని ఢీకొట్టి 10 మీటర్ల వరకు లాక్కెళ్లారు. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)
ఇద్దరు వ్యక్తులు ధర్మేందర్, రజనీష్‌లను ప్రధాన నిందిలుగా చేర్చారు. మరో ఇద్దరు జితేందర్ అలియాస్ జీతు, మనోజ్ షరేమాన్‌లు ధర్మేందుర్‌కి ఆశ్రయం కల్పించినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మేందర్, రజనీష్‌లను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్‌కి న్యాయం జరిగేలా ఛార్జిషీట్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నాగ్లోయ్‌లోని వీణా ఎన్‌క్లేవ్‌లో అదే ప్రాంతంలో నివసిస్తున్నందున నిందితులు సందీప్ మాలిక్‌కి తెలుసని దర్యాప్తులో తేలింది. హర్యానాలోని రోహ్‌తక్‌కి చెందిన సందీప్ మాలిక్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మేందర్ తన స్నేహితుడు అమిత్ నుంచి కారుని తీసుకున్నాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.