రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. అందుకే భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ అరెస్ట్ అన్నదే పెద్ద ఆన్లైన్ కుంభకోణమని తెలిపింది. ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక లావాదేవీలకు వాట్సప్ ద్వారా కానీ.. స్కైప్ గానీ ఉపయోగించవని తెలిపింది. ఎవరైనా ఫోన్లో గాని ఈ మెయిల్ ద్వారా సంప్రదించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దర్యాప్తు చేస్తున్నామని చెబితే.. భయపడకుండా ముందుగా వారి గుర్తింపును ధృవీకరించుకోవాలని సూచించింది. మోసగాళ్లు.. మభ్యపెట్టి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తే.. మన భయమే వారి పనిని సులువు చేస్తుందనే విషయాన్ని గుర్తించుకోవాలని తెలిపింది. చట్టబద్ధమైన ఏజెన్సీలు తక్షణం డబ్బు పంపాలని ఒత్తిడి తీసుకురావని స్పష్టం చేసింది. తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే.. వ్యక్తిగత, ఆర్థిక పరమైన వివరాలు ఇవ్వొద్దని సూచించింది.
READ MORE: Actor Vijay: విజయ్ మా ఐడియాలజీని కాపీ కొట్టాడు.. డీఎంకే, ఏఐడీఎంకే విమర్శలు..
స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే..
1. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి.
2. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి.
3. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి.
4. అనుమానాస్పద కాల్‌లు/నంబర్‌లపై రిపోర్ట్ చేయండి.
5. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
6. కేవైసీని వ్యక్తిగతంగా అప్‌డేట్ చేయండి.
7. వ్యక్తిగత/బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.