CM Relief Fund Scam: ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు కేటుగాళ్లు. నకిలీ పత్రాలతో ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను కాజేశారు. ఆపదలో ఉన్నవారికి అందాల్సిన డబ్బులను తమ అకౌంట్‌లో జమ చేసుకున్నారు నకిలీగాళ్లు. కాజేసిన సొమ్మును తలా ఇంత వాటాలేసుకుని పంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఓ మినిస్టర్ పేషీలో పనిచేసిన ఓ కంత్రీ ఫెలో చేసిన మోసాన్ని కూపీ లాగారు పోలీసులు. సీఎం రిలీఫ్ ఫండ్ !! ఆపదలో ఉన్న వారికి ఇదో ఆపన్నహస్తం. ఆస్పత్రుల పాలైన.. ప్రాణాలు కోల్పోయిన లేదా విపత్తులో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఆర్థికంగా సహాయం అందించేదే సీఎం రిలీఫ్ ఫండ్. ఇలాంటి డబ్బులను కూడా కాజేశారు కేటుగాళ్లు. ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం పెట్టారు. అసలైన బాధితులకు అందాల్సిన డబ్బులను తమ జేబుల్లో వేసుకున్నారు కొందరు కంత్రీగాళ్లు.
READ ALSO: Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !
ఆయన పేరు పొట్ల రవి. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన వ్యక్తి. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రి పేషీలో పనిచేశాడు. మంత్రి వద్ద అన్ని పనులు చక్కబెడుతూనే.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించిన ఫైల్స్‌ను కూడా చేసేవాడు. మంత్రి సిఫారసుతో మంజూరైన చెక్కులను బాధితులకు అందేలా చూసేవాడు. ఈ క్రమంలో బాధితులకు మంజూరైన 230 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాజేశాడు పొట్ల రవి. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోగానే.. ఈ చెక్కులను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇవన్నీ మంజూరైనా సరే.. లబ్ధిదారులకు పంపిణీ చేయబడని చెక్కులు. ఇందులో ఫాలోఅప్ చేయని లబ్ధిదారులను గుర్తించాడు. సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసి… ఆపై వస్తుందో రాదో అని ఆశలు వదులుకునే వాళ్లుంటారు. చెక్కులు మంజూరైన విషయం కూడా తమకు తెలియదు. రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే తప్ప విషయం తెలియదు. అలాంటి 19 చెక్కులను తన వద్ద ఉంచుకున్నాడు పొట్ల రవి.
నకిలీ వ్యక్తుల ఖాతాల్లోకి సొమ్ము..
ఈ 19 లబ్ధిదారుల పేర్లతో మ్యాచ్ అయ్యేలా… కొందరు నకిలీ వ్యక్తులను సృష్టించాడు పొట్ల రవి. వీళ్లే అసలైన బాధితులుగా.. వీళ్ల పేర్ల మీదే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు అయినట్లు నికిలీ డాక్యుమెంట్లు రెడీ చేశాడు. వీటి ద్వారా ఆ 19 చెక్కులకు చెందిన 8 లక్షల 71 వేల రూపాయలను నకిలీ వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యేలా చేశాడు. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నకిలీగాళ్లంతా కలిసి ఆ డబ్బులను తలా ఇంత పంచుకున్నారు. పక్కా సమాచారం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు కూపీ లాగారు. డొంక కదిలింది. కంత్రీ గాళ్ల నకిలీ బాగోతం బయటపడింది. అసలు సూత్రదారుడు పొట్ల రవితోపాటు.. లబ్ధిదారులుగా నటించిన జనగామ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వీరి కోసం గాలిస్తున్నారు. దుర్వినియోగం ఐన నిధులను తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నామని.. వీటిని అసలైన లబ్ధిదారులకు అందేలా చూస్తామంటున్నారు పోలీసులు.
READ ALSO: Russia Ukraine War: పసి కూనపై రష్యాకు ఎందుకు ఇంత పగ.. !