తాజాగా బెంగళూరు నగరానికి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్త ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. హౌస్, కార్ ఇలా కొన్ని ఈఎమ్ఐలను చెల్లించలేక కాస్త చిక్కుల్లో పడ్డాడు. దీనితో అతను ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు ఏకంగా ఆయన తన కిడ్నీని అమ్మాలని భావించాడు. ఇందుకోసం మొదటగా ఆన్ లైన్ లో సెర్చ్ మొదలు పెట్టగా అతడికి ఏదో ఓ వెబ్ సైట్ కనపడింది. అందులో ఉన్నఫోన్ నెంబర్ కు కాల్ చేసి తాను కిడ్నీ అమ్మాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో అవతల ఉన్న వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి వివరాలు తీసుకున్నాడు. అలా వివరాలు తీసుకున్న వ్యక్తి ఒక కిడ్నీకి ఏకంగా రూ.2 కోట్లు ఇస్తానని నమ్మపలికాడు. అంతేకాదండోయ్.. ముందుగానే సగం అమౌంట్ అంటే ఏకంగా రూ. కోటి అడ్వాన్స్ ఇస్తామని కూడా తెలిపాడు.
అయితే ఈ స్కామ్ ను నిజమని నమ్మిన చార్టర్డ్ అకౌంటెంట్ కిడ్నీ దానానికి ఓకే చెప్పేసాడు. దీనితో మోసం చేసిన నిందితులు మొదటగా చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ఆధార్, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడీ లాంటి తదితర వివరాలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే కిడ్నీ దానానికి ఎన్ఓసీ (NOC) కావాలంటూ చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి తొలుత రూ.8 వేలు తీసుకున్నారు. ఆఫై పర్ఛేజ్ కోడ్ అంటూ మరో రూ.20 వేలు కూడా నొక్కేశారు. అంతేకాదు ఆ తర్వాత కూడా కోడ్ ఆపరేట్ చేసేందుకు అంటూ మరో రూ.85 వేలు అతడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆపై చార్టర్డ్ అకౌంటెంట్ కి రూ. కోటి అడ్వాన్స్ చెల్లించేందుకు టాక్స్ క్లియరెన్స్ చేయాలనీ అందుకు గాను మరో రూ.5 లక్షలు కూడా అతడి నుంచి లాగేసారు.
ఇంతటితో ఆగకుండా మోసగాళ్లు మరో మహిళతో తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగినంటూ అతడికి కాల్ చేసి… టెర్రరిస్టు క్లియరెన్స్, యాంటీ డ్రగ్ లాంటి పర్మిషన్స్ తెచ్చుకునేందుకు మరో రూ 7.6 లక్షలను చెల్లించాలని కోరగా.. ఇలా రకరకాల కారణాలతో తన నుంచి డబ్బులు లాగుతుండడంతో బాధితుడికి అనుమానం మొదలయింది. దాంతో ఈ విషయాన్ని బాస్ తో పాటు తన మిత్రులకు వాకబు చేశాడు. దాంతో తాను మోసపోయినట్టు వారు తెలపడంతో చివరికి అతను లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు సదరు సైబర్ నిందితుల పై ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి., ఆ నిందితుల అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయించారు.