Bengaluru: తన భార్యను పక్కా పథకంలో హత్య చేసిన బెంగళూర్ డాక్టర్ ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెలలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత నిందితులు, పలువురు మహిళకు సంచలన మెసేజ్‌లు పంపించాడు. ‘‘నేను మీ కోసమే నా భార్యను చంపాను’’ అని ఫోన్ పే యాప్ ద్వారా డాక్టర్ మహేంద్ర రెడ్డి మెసేజ్‌లు చేశాడు. ఇలా మెసేజ్‌లు అందుకున్న వారిలో ఒక వైద్యురాలు కూడా ఉంది. గతంలో మహేంద్ర రెడ్డి ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది.
పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి డేటాను తిరిగి పొందారు. దీనిని విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపిన తర్వాత ఈ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. మహేంద్ర తన భార్య మరణం తర్వాత పాత సంబంధాలను తిరిగి ట్రాక్‌లో పెట్టడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లోనే వాడే మత్తుమందు ప్రొపోఫోల్‌ను ఉపయోగించి డెర్మటాలజిస్ట్ అయిన తన భార్య డాక్టర్ కృత్తికా ఎం రెడ్డిని హత్య చేశాడనే అభియోగాల కింద అక్టోబర్‌లో మహేంద్రను అరెస్ట్ చేశారు.
Read Also: Madhuri : వాడు పశువుతో సమానం.. భరణితో ట్రోల్స్ పై స్పందించిన మాధురి..
వీరిద్దరు విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసేవారు. మే 26, 2024లో వీరికి వివాహం జరిగింది. ఏడాది తర్వాత, ఏప్రిల్ 23,2025లో కృత్తికా ఆరోగ్య సమస్యల కారణంగా మారతహళ్లిలోని తన తండ్రి ఇంట్లో కుప్పకూలింది. మహేంద్ర ఆమెను చికిత్స పేరుతో రెండు రోజుల పాటు ఇంట్రీవీనస్ ఇంజెక్షన్లు ఇచ్చాడని, అవి చికిత్సలో భాగమని చెప్పాడని తేలింది. దీని తర్వాత, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చనిపోయింది. ప్రారంభంలో అంతా సహజ మరణం అనుకున్నారు. అయితే, కృత్తికా సోదరి డాక్టర్ నికితా ఎం రెడ్డి అనుమానం వ్యక్తం చేయడం, సమగ్ర దర్యాప్తును కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక తర్వాత ఆమె అవయవాల్లో ప్రొపోఫోల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్తికాకు మత్తు మందు ఇచ్చినట్లు నిర్ధారణ అయింది.
దీని తర్వాత నిందితుడిపై హత్య నేరాలు మోపబడ్డాయి. మహేంద్రనున ఉడిపిలోని మణిపాల్ లో అరెస్ట్ చేశారు. భార్య మరణం తర్వాత అతను అక్కడికి వెళ్లారు. మహేంద్ర కుటుంబానికి క్రిమినల్ కేసుల చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. అతని కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి GS 2018లో అనేక మోసం, క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నాడు. ఇంకో సోదరుడు రాఘవరెడ్డి 2023లో బెదిరింపు కేసులో సహ నిందితుడిగా ఉన్నాడు. వివాహ సమయంలో ఈ వివరాలు దాచి పెట్టినట్లు కృతిక కుటుంబం చెప్పింది.