కన్న తండ్రి.. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొనేవాడు. వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటుపడేవాడు. కానీ, ఆడపిల్లలను, ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నారు కొంతమంది కసాయి తండ్రులు. కామంతో కళ్ళుమూసుకుపోయి, వావివరుసలు మరిచి, కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక కన్నతండ్రి తన 15 ఏళ్ల కూతురిపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం కన్నతల్లికి తెలిసి.. భర్త చేసిన నీచమైన పనికి అతడిని శిక్షించాలనుకుంది. కానీ, అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి సరిపోలేదు. దీంతో న్యాయస్థానమే తమను ఆదుకోవాలని కోర్టు ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. లాహోర్ కి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహమైంది. వారికి ఐదుగురు కుమార్తెలు. మొదట్లో సాజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకొని వేరు వేరుగా ఉంటున్నారు. విడాకుల తరువాత ముగ్గురు పిల్లలు తండ్రి వద్ద, ఇద్దరు పిల్లలు తల్లి వద్ద పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి వద్ద ఉన్న 15 ఏళ్ల చిన్నారి ఇటీవల తల్లిని కలిసింది. ఆమె ముభావంగా ఉండడంతో ఏమైంది అని అడగగా తండ్రి తనపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడని, ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరిస్తునట్లు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన భార్య ..భర్తను నిలదీసింది. అతడు ఏ మాత్రం భయపడకుండా.. వెళ్లి నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో.. జైల్లో పెట్టిస్తావా.. వచ్చాకా నీ పిల్లలందరినీ రేప్ చేస్తా అని బెదిరించాడు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి పిల్లలను రక్షించుకోవడానికి కోర్టు మెట్లెక్కింది. కోర్టులో న్యాయం కోసం పోరాటం చేయాలంటే డబ్బు కావాలి, దానికి కూడా స్తోమత లేక కోర్టు ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయింది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను అడ్డుకొని న్యాయస్థానానికి ఆమె తరపున అప్పీలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన లాహోర్లో సంచలనంగా మారింది.