Haveri Incident: కర్ణాటకలో మతాంతర జంట హోటల్ గదిలో ఉండగా.. ముస్లిం యువకుల మూక వారిపై దాడి చేసింది. ఏడుగురు నిందితులు వారిని తిడుతూ, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హవేరి ప్రాంతంతో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధిత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఆరోపణలతో పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు.
ఈ ఘటన జనవరి 8న జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన 26 ఏళ్ల వివాహిత, 40 ఏళ్ల కేఎస్ ఆర్టీసీ డ్రైవర్‌తో మధ్యాహ్నం 1 గంట సమయానికి హోటల్‌లోకి ప్రవేశించింది. గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు హోటల్ గదిలో ఉండగా 7 మంది వ్యక్తులు గదిలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. నిందితులు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచీ, యువతిని వారితో తీసుకెళ్లి శారీరక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సీరియస్ అయింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల్లో స్పందన రాకపోతే..కర్ణాటకకు తమ బృందాన్ని పంపుతామని చెప్పారు. మహిళపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. హోటల్ గదిలో జరిగిన ఈ దాడిని నిందితులు చిత్రీకరించారని, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయని వారు తెలిపారు. వీలైనంత త్వరగా అరెస్టు చేసి.. బాధితురాలికి ఉచితంగా వైద్యం అందించాలని ఎన్‌సిడబ్ల్యూ కోరింది.