AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరో నిందితుడు రాజేష్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు..
Read Also: Off The Record : జూబ్లీ హిల్స్ పోరులో మైనార్టీల ఓట్లు ఎవరికి?
నిందితుల ట్రాప్‌లో పడ్డారు పలువురు సోషల్ మీడియా యూజర్లు… ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చురుకుగా ఉంటూ… వైద్య సహాయం అవసరం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకునేవారు. తాము విదేశాల్లో స్థిరపడిన భారతీయులమని పరిచయం చేసుకుని, సాయం చేస్తామని నమ్మబలికేవారు. ఈ విధంగా ప్రజల నుంచి సులభంగా డబ్బులు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి నారా లోకేష్ ఫోటోను డీపీగా పెట్టడం వల్ల, వారిపై జనంలో విశ్వసనీయత పెరిగిందని, దీనినే అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇక, అరెస్ట్ అయిన సాయి శ్రీనాథ్, సుమంత్ లపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 9 కేసులు నమోదై ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. ఇక, నిందితుల నుంచి రూ. 2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సీఐడీ పోలీసులు..