Airhostess Locks Man Who Assaulted Her At Her House: ఆమె ఒక ఎయిర్‌హోస్టెస్.. తెలిసినవాడే కదా అని ఓ వ్యక్తిని తన ఇంట్లోకి రానిచ్చింది.. అతడున్న పరిస్థితిని చూసి సహాయం చేయాలనుకుంది.. కానీ అతని వక్రబుద్ధిని గమనించలేకపోయింది. ఆసరా చూసుకొని, అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సహాయం చేద్దామనుకున్న ఆమెపైనే అఘాయిత్యానికి దిగాడు. అయితే.. ఆ మహిళ కూడా కుంగిపోకుండా అతనికి సరైన బుద్ధి చెప్పింది. పోలీసులకు పట్టించి, తన ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కాన్పూర్‌కి చెందిన హర్‌జీత్ యాదవ్ అనే వ్యక్తికి నెలన్నర క్రితం ఓ ఎయిర్‌హోస్టెస్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె పట్ల మంచిగా వ్యవహరిస్తూ.. మార్కులు కొట్టేశాడు. అయితే.. ఆదివారం అతడు మత్తుపదార్థాలు సేవించి, ఆ ఎయిర్‌హోస్టెస్ ఇంటికి వెళ్లాడు. స్నేహితుడు కదా అని.. మత్తులో ఉన్న అతడ్ని లోపలికి ఆహ్వానించింది. అప్పుడు హర్‌జీత్ తన అసలు రూపం బయటపెట్టాడు. సమయం చూసుకొని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనని వదిలిపెట్టమని ఎంత వేడుకున్నా.. అతడు మృగంలా ఆమెపై ఎగబడ్డాడు. అయితే.. ఆ ఎయిర్‌హోస్టెస్ ఆ తర్వాత అతడ్ని విడిచిపెట్టలేదు. తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న హర్‌జీత్‌ని పట్టుకుని బంధించింది. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ ఎయిర్‌హోస్టెస్ నివాసానికి వెళ్లి, నిందితుడ్ని పట్టుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు నిందితుడ్ని కస్టడీకి తరలించారు.