Bihar: భోజనం చేసిన తరువాత పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. అలా భోజనం చేసిన తరువాత కొందరు తమకిష్టమైన పండు ఏదో ఒకటి తింటారు. అది అరటిపండు కావచ్చు.. యాపిల్ కావచ్చు.. లేదంటే సీజనల్ వారీగా లభించే ఏదైనా పండు కావచ్చు. అయితే కొందరికి భోజనం చేసిన తరువాత ఏదో ఒక చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాటిలో ఐస్‌క్రీమ్, పానీపూరీ, చిప్స్ వంటివి ఉంటాయి. ఇలానే భోజనం చేసిన తర్వాత పానీపూరి తినేందకు వెళ్లాడు ఒక టీచర్. అలా వెళ్లిన టీచర్‌ను దుండగులు కాల్చి చంపారు. ఆయనతోపాటు వెళ్లిన మరొక వ్యక్తిని కూడా దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
Read also: Addanki Ci: నెట్టింట అద్దంకి సీఐ ఆడియో టేపులు వైరల్
బిహార్ రాష్ట్రంలోని సుపౌల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన 42 సంవత్సరాల మహ్మద్ నూరుల్లా గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లగా బైక్‌పై వచ్చిన దుండగులు నూరుల్లాతో పాటు దుకాణ యజమాని సికందర్ దాస్ పై కూడా కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు ఆపై ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం పానీపూరి తినేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుకాణానికి వెళ్లగా దుండగులు నూరుల్లాతో పాటు షాపు యజమానిపై కాల్పులు జరిపి ఇద్దరినీ చంపేశారని నూరుల్లా కుటుంబ సభ్యులు తెలిపారు. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టానికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.