Serial killer: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సీరియల్ కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బరేలీలో ఆరు నెలల వ్యవధిలో 9 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. ఒంటరి మహిళలే టార్గెట్ అవుతుండటంతో మహిళలు ఎవరూ కూడా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు.
ఈ హత్యల నేపథ్యంలో యూపీ పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. నగరంలోని షాహి, ఫతేగంజ్ వెస్ట్ మరియు షీష్‌గఢ్ ప్రాంతాలలో గత కొన్ని నెలల్లో చాలా కేసులు నమోదయ్యాయి. హత్యలకు గురవుతున్న మహిళలందరూ.. 50-65 ఏళ్ల వయసులో ఉన్నట్లు గుర్తించారు.
Read Also: White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న మిస్టరీ ‘వైట్ లంగ్ సిండ్రోమ్’.. లక్షణాలు ఇవే..
మహిళలందర్ని గొంతులు కోసి చంపారని, వారి మృతదేహాలు పొలాల్లో కనిపించాయని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు ముందు మహిళలపై దోపిడి కానీ అత్యాచారం, లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని స్థానికులు అవసరమైతే తప్పా తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు చెప్పారు.
హత్యకు గురైన మహిళల్లో ఒకరి కుమార్తె..55 ఏళ్ల తన తల్లి పొలానికి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు చెరుకు తోటలో సదరు మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు 8 మంది అధికారులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. బరేలీలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచారు. హత్యలకు గురైన కొంతమంది మహిళల పోస్ట్‌మార్టం రిపోర్టు గురించి ఎదురుచూస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.