Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. 2000 జూలై 29న కోటనందూరు ప్రాంతానికి చెందిన శేషుబాబు, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెను హతమార్చాడు. అలాగే, ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారని భావించి వారిని కూడా చంపేశాడు. కాగా, ఈ నేరానికి సంబంధించి 2002 మే నెలలో కాకినాడ అదనపు సెషన్స్ కోర్టు అతనికి మూడు యావజ్జీవ శిక్షలను విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఇవి ఏకకాలంలో అమలు చేయాలని పేర్కొనింది. అనంతరం హైకోర్టు కూడా ఈ తీర్పును ఖరారు చేసింది.
Read Also: Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్.. ఏ పార్టీకి షాక్, ఏ పార్టీకి జాక్‌పాట్!
కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ శేషుబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని శేషుబాబుకు క్షమాభిక్ష ఇవ్వవచ్చా అని అడిగింది. అయితే, చిన్నారులను హత్య చేసిన కేసు కావడంతో క్షమాభిక్ష అనుమతించలేమని సర్కార్ తెలిపింది. దీంతో శేషుబాబు ఇప్పటికే 23 ఏళ్ల జైలు జీవితం గడిపినా, రిమిషన్ (శిక్ష తగ్గింపు) సహా లెక్కిస్తే 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపినట్లు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనింది. నిందితుడికి మిగిలిన శిక్ష కాలాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఆలయ పాలకమండలి కీలక భేటీ!
అయితే, శేషుబాబు దాఖలు చేసిన అప్పీల్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా, ట్రయల్ కోర్టు ఇప్పటికే విధించిన షరతుల మేరకు నిందితుడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, శేషుబాబు విడుదల తర్వాత ఎలాంటి నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటే, శిక్ష సస్పెన్షన్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని అత్యున్నత న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
