Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై భవానీ దీక్షల విరమణాల సందర్బంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇక, మహా మంటపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజినీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 4వ తేదీన జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, భవాని దీక్షల విరమణ సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read Also: Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా
ఇక, ఇరుముడి పాయింట్లు, హోమ గుండాలు ఏర్పాటుతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సూచించారు. దర్శన క్యూ లైన్లు, మంచి నీరు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు గిరి ప్రదక్షిణ మార్గం, కేశ ఖండన సత్రాల ఏర్పాటు, భక్తుల పుణ్య స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మైక్ ప్రచారం, ఉచిత బస్ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. అలాగే, రేపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే భవాని దీక్షల సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సంవత్సరం భవాని దీక్షల విరమణకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అన్ని డిపార్టుమెంట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనా నాయక్ కోరారు.