ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమాతో తన వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆహా! తాజాగా అలా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ‘నారింజ మిఠాయి’. 2019 డిసెంబర్ లో ‘సిల్లు కరుప్పత్తి’ అనే తమిళ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత అది నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయ్యింది. దాని తెలుగు వర్షనే ‘నారంజ మిఠాయి’.
సహజంగా ఆంథాలజీ అనగానే ఎన్ని భాగాలు ఉంటే… అంతమంది దర్శకత్వం చేయడం మనం చూస్తున్నాం. కానీ ఇందులోని నాలుగు భాగాలనూ కూడా హలితా షమీమ్ డైరెక్ట్ చేశారు. ఆవిడకు ఇది రెండో సినిమా.
మొదటి కథ ‘పింక్ బ్యాగ్’ పిల్లలకు సంబంధించింది. కార్పొరేషన్ వాళ్ళ గార్బేజ్ యార్డ్ లో చెత్త ఏరుకునే మాంజా అనే కుర్రాడికి చెందింది. ఆ చెత్త కుప్పల్లో పడి ఉండే పింక్ బ్యాగ్ లోని వస్తువులను కలెక్ట్ చేయడం మాంజాకి అలవాటుగా మారిపోతుంది. ఓసారి ఆ బ్యాగ్ లో వాక్ మేన్ లభిస్తుంది. మరోసారి ఓ ఉంగరం కూడా కనిపిస్తుంది. ఆ ఉంగారం ఎవరిదో తెలుసుకుని, మాంజా దానిని ఎలా తిరిగిచ్చాడన్నదే ఆ ఎపిసోడ్ సారాంశం. చెత్త ఏరుకునే పిల్లల్లోనూ సున్నితమైన మనస్సు ఉంటుందని చాలా హృద్యంగా దర్శకురాలు ఇందులో చూపించారు. మాంజాగా రాహుల్ నటిస్తే… మరో కీలక పాత్ర మిట్టీగా సారా అర్జున్ నటించింది. బేబీ సారాని మనం తమిళ డబ్బింగ్ సినిమా ‘నాన్న’లోనూ, ‘దాగుడు మూతల దండాకోర్’లోనూ చూశాం.
ఇక రెండో కథ ‘కా కా గాడి’… ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సరదాగా మీమ్స్ క్రియేట్ చేసే కుర్రాడికి సంబంధించింది. మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత అతనికి క్యాన్సర్ వస్తుంది. ముందు అనుకున్న సంబంధం కాన్సిల్ అవుతుంది. విపరీతమైన మానసిక సంఘర్షణకు గురౌతున్న సమయంలో ఓ ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవుతుంది. అతనిలో ఓ పాజటివ్ థింకింగ్ ను ఆమె ఎలా కలిగించిందన్నదే కథ. రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న మణికందన్ ఇందులో మెయిన్ లీడ్ చేశాడు. అతన్ని అభిమానించే అమ్మాయిగా నివేదిత సతీశ్ నటించింది. ఆమె గతంలో తెలుగులో వచ్చిన ‘హలో’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది.
ఇక మూడో కథ… ‘టర్టిల్’. ఎనిమిదేళ్ళ క్రితం భార్య చనిపోవడంతో ఒంటరి తనం అనుభవిస్తున్న ప్రకాశ్ అనే ఓ వ్యక్తికి, కెరీర్ కారణంగా పెళ్ళి చేసుకోని ఓ యాభై ఐదేళ్ళ అవివాహితకు మధ్య ఏర్పడ్డ పరిచయం ఎలా వారిని ఒకటి చేసిందన్నది ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ఇందులో నృత్య కళాకారిణిగా లీలా శాంమ్సన్ నటించారు. ఆవిడ నిజంగానే చక్కని డాన్సర్. పలు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు పోషించారు. ఇక మరో కీలక పాత్రను ‘క్రవ్ మాగా’ శ్రీరామ్ చేశారు. ఇదే అతనికి మొదటి సినిమా. బాధాకరం ఏమంటే… చాలా చక్కటి నటన కనబరిచిన శ్రీరామ్… జనవరి 23న ప్రమాదవశాత్తు ఇంటి మేడ మీద నుండి పడి చనిపోయారు.
ఇక నాలుగో కథ ‘హే అమ్ము’… ఇందులో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా సునయన, సముతిర కని నటించారు. జీవితం రొటీన్ అయిపోతే మహిళలు పడే బాధను సునయన పాత్ర ద్వారా చూపించారు. భార్య మనసులోని ఆ శూన్యాన్ని భర్త ఎలా తెలుసుకున్నాడు… ఎలా పూడ్చాడన్నది మిగతా కథ.
ఈ మొత్తం నాలుగు ఎపిసోడ్స్ లోని నటీనటులూ చాలా సహజమైన నటన కనబరిచారు. ప్రదీప్ కుమార్ సంగీతం అద్భుతం… సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది. ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకుంటుంది. మనుషులు, వారిలో ఉండే పాజిటివిటీ, అలానే తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పులు… వాటిని సరిదిద్దుకునే విధానం… దర్శకురాలు చక్కగా చూపించారు. ఈ చిత్రానికి సూర్య సమర్పకుడిగా వ్యవహరించారు. రామకృష్ణ వీరపనేని దీనిని తెలుగువాళ్ళ ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని చూసినప్పుడు ఆరేడేళ్ళ క్రితం ప్రవీణ్ సత్తారు తీసిన ‘చందమామ కథలు’ సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ తరహా ఆంధాలజీ మూవీస్ కి జనంలో చక్కని స్పందన వస్తోంది. థియేట్రికల్ రిలీజ్ లో వీటికి ఆదరణ ఎలా ఉంటుందనేది డౌటే… కానీ ఓటీటీలకు ఇలాంటివి ఓ వరం అనుకోవాలి.
ఏదేమైనా… ఈ వీకెండ్ లో మనసుకు హాయిని కలిగించిన ‘నారింజ మిఠాయి’ని అందించిన ఆహా టీమ్ ను అభినందించాలి.
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే కథ, కథనాలు
నటీనటుల సహజ నటన
దర్శకురాలి ప్రతిభ
నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించే పేరు కాకపోవడం
బాటమ్ లైన్
మానవీయ కోణంలో సాగే మధుర చిత్రం!